విడాకుల తర్వాత కుంగిపోయా.. నా జీవితంలోకి రాజ్ రావడం నా అదృష్టం: సమంత

V. Sai Krishna Reddy
2 Min Read

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన వ్యక్తిగత జీవితం గురించి తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. మాజీ భర్త నాగ చైతన్యతో విడాకుల తర్వాత తాను ఎదుర్కొన్న తీవ్ర మానసిక వేదన, ఆ తర్వాత దర్శకుడు రాజ్ నిడిమోరుతో మొదలైన కొత్త జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా పంచుకున్నారు. ఆమె మాటలు ఇప్పుడు అభిమానులను, సినీ వర్గాలను కదిలిస్తున్నాయి.

నాగ చైతన్యతో విడాకుల అనంతరం తాను మానసికంగా పూర్తిగా కుంగిపోయానని సమంత గుర్తుచేసుకున్నారు. “ఆ సమయంలో నా ప్రపంచాన్ని నేను పూర్తిగా మూసేశాను. మానసికంగా చాలా బలహీనపడ్డాను. ఇకపై జీవితంలో ఎవరినీ నమ్మకూడదని, ఇంకొకరిపై ఆధారపడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ప్రేమ అనే భావన మళ్లీ నా జీవితంలోకి వస్తుందని అస్సలు ఊహించలేదు” అని ఆమె తెలిపారు.

అలాంటి క్లిష్ట సమయంలో దర్శకుడు రాజ్ నిడిమోరు తన జీవితంలోకి రావడం ఒక అదృష్టమని సమంత పేర్కొన్నారు. “అలాంటి స్వచ్ఛమైన ప్రేమను, స్నేహాన్ని స్వీకరించగలిగే సున్నితత్వం నాలో ఇంకా మిగిలి ఉండటం నా అదృష్టం. ఇప్పుడు నేను ఒక మంచి బంధంలో ఉన్నాను. దానివల్లే మునుపటి కంటే మెరుగైన వ్యక్తిగా మారగలిగాను. రాజ్ లాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడమే దానికి కారణం” అని ఆమె ఎమోష‌న‌ల్ అయ్యారు.

తనలో వచ్చిన ఈ మార్పును తన స్నేహితులు కూడా గుర్తించారని సమంత సంతోషం వ్యక్తం చేశారు. “కొద్దిరోజుల క్రితం నా పాత స్నేహితురాలు ఒకరు నన్ను కలిసి, తర్వాత ఒక వాయిస్ నోట్ పంపింది. ‘ఇప్పుడే నువ్వు నిజంగా ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇకపై నువ్వు ఏదీ నటిస్తున్నట్టు లేదు’ అని చెప్పింది. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి” అని వివరించారు.

‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెట్స్‌లో 2021లో తొలిసారి కలుసుకున్న సమంత, రాజ్ మధ్య పరిచయం బలమైన బంధంగా మారి, గతేడాది వారి వివాహానికి దారితీసింది. ప్రస్తుతం సమంత తన సొంత బ్యానర్‌పై ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరిస్తూ ఆమెకు పూర్తి అండగా నిలుస్తున్నారు. వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను అధిగమించి కొత్త ప్రయాణం ప్రారంభించిన సమంతకు సోషల్ మీడియాలో అభిమానులు మద్దతు తెలుపుతూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *