కొమురవెల్లి మల్లన్న పెద్ద పట్నం
చేర్యాల (కొమురవెల్లి)ఫిబ్రవరి16 (ప్రజాజ్యోతి):తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి సందర్భంగా ఆలయ తోటబావి వద్ద పెద్ద పట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అధికారులు. పంచ రంగులతో 42 వరుసలతో పెద్ద పట్నాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ ఒగ్గు పూజారులు. లింగోద్భవ కాలంలో స్వామివారి గర్భాలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయ అర్చకులు నిర్వహించారు.అర్ధరాత్రి సమయంలో ఆలయ తోటబావి వద్ద స్థానిక ఒగ్గు పూజారులు మూడు గంటలకు పైగా అత్యంత భక్తి శ్రద్ధలతో మల్లన్నకు పంచ రంగులతో 42 వరుసలతో పెద్ద పట్నాన్ని రచించి పట్నం మధ్యలో నిమ్మకాయలతో చిత్ర కన్ను నెలకొల్పి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.పట్నానికి అష్ట దిక్కుల నిమ్మకాయలు, గుమ్మడి కాయలతో బలిహరణ చేసి పట్నం పైకి ఆవహానం చేస్తారు. ఒగ్గు పూజారులు బోనాలు సమర్పించిన అనంతరం వీరశైవ అర్చకులు గర్భాలయం నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి పసుపుతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాలతో పట్నాన్ని దాటారు.అనంతరం పెద్ద పట్నాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు, శివసత్తులు పట్నాన్ని తొక్కుతూ తన్మయత్వం పొందారు. దీంతో ఒక్కసారిగా ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి.కోరమీసాల కొమురవెల్లి మల్లన్న పెద్ద పట్నం కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, శివసత్తులు పెద్ద పట్నం తొక్కేందుకు పోటీపడ్డారు.
