- గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో గడ్డి మందు తాగిన ఓ యువకుడు, నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచాడు. నర్సాపూర్ పట్టణంలోని శివాలయం వీధికి చెందిన బల్లెపు నవీన్ (22) ఈ విషాద ఘటనకు బలయ్యాడు. స్థానిక శివాలయం వీధిలో నివాసముండే నవీన్, కూలీ పనులు చేస్తూ జీవించేవాడు. తన గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించిన అతడు, ఆ ప్రేమ విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలోనే గత నెల 18వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. జనవరి 21న గాంధీ ఆసుపత్రిలో చేరిన నవీన్, అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఫిబ్రవరి 14న తుదిశ్వాస విడిచాడు. మృతుడి సోదరుడు శ్రీహరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు వివరాలు వెల్లడించారు.
