ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రణీత్ రావు పదోన్నతి రద్దు

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్రమంగా ట్యాపింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు కల్పించిన యాక్సిలరేటెడ్ ప్రమోషన్, తద్వారా ఆయన పొందిన డీఎస్పీ హోదాను రద్దు చేసింది. ఇకపై ఆయన ఇన్ స్పెక్టర్ గానే కొనసాగుతారంటూ హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.వి.ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన క్రిమినల్ కేసులో ప్రణీత్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే.

అసలేం జరిగిందంటే..

ప్రణీత్‌రావు ఎస్సై హోదాలో 2016 అక్టోబరు 24న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)కు బదిలీ అయ్యారు. 2023 డిసెంబరు 13 వరకు అక్కడే, అదే హోదాలో పనిచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు యాక్సిలరేటెడ్‌ ప్రమోషన్ విధానంలో డీఎస్పీగా పదోన్నతి కల్పించింది. ఆయన నేతృత్వంలో ఎస్‌ఐబీలో స్పెషల్‌ ఆపరేషన్స్‌ టార్గెట్‌(ఎస్‌వోటీ) ను ఏర్పాటు చేసింది.

వివాదం ఏంటి..

ప్రణీత్ రావు 2007 బ్యాచ్ ఎస్సై.. ఈ బ్యాచ్ లో దాదాపు 300 మంది ఎస్సైలు ఉండగా.. ఒక్క ప్రణీత్‌ రావుకు మాత్రమే ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి కల్పించింది. అదీ యాక్సిలరేటెడ్ ప్రమోషన్ విధానంలో కావడం వివాదాస్పదమైంది. సాధారణంగా తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో ప్రతిభ కనబరిచిన పోలీస్‌ అధికారులకు ఈ విధానంలో ప్రమోషన్ ఇస్తుంటారు. ప్రణీత్ రావు అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా డీఎస్పీ హోదా కట్టబెట్టడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.

కేసు ఎందుకు..?

డీఎస్పీగా పదోన్నతి పొందిన ప్రణీత్ రావు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని, ప్రతిపక్ష నేతలు సహా పలువురు సెలబ్రెటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసి ప్రభుత్వ పెద్దలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా.. 2023 శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు ఎస్‌ వోటీ లాగర్‌రూంలోని ల్యాప్‌ టాప్‌ లు, కంప్యూటర్లలోని 42 హార్డ్‌డిస్క్‌లు, అందులోని డేటాను ధ్వంసం చేయడంలో ప్రణీత్‌రావు కీలకపాత్ర పోషించినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది.

ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వం.. ప్రణీత్ రావును 2024 మార్చి 2న సస్పెండ్ చేసింది. మార్చి 10న ఆయనపై పంజాగుట్ట ఠాణాలో క్రిమినల్‌ కేసు నమోదు కావడంతో అదే నెల 12న ప్రణీత్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *