జనగామ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలనుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బావమరిది పెద్ది నవీన్ కుమార్ గౌడ్కు చుక్కెదురైంది. 6వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కించుకోవాలని ఆయన వేసిన ప్లాన్ తలకిందులైంది. సోమవారం విడుదలైన అభ్యర్థుల తుది జాబితాలో నవీన్ పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు షాక్కు గురయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ భార్యకు తమ్ముడైన నవీన్ కోసం స్వయంగా మంత్రి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగానే ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, నవీన్ ‘స్థానికేతరుడు’ (హనుమకొండకు చెందిన వ్యక్తి) అంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. నవీన్కు టికెట్ ఇవ్వొద్దంటూ సంతకాల సేకరణ చేపట్టి మరీ అధిష్ఠానానికి పంపారు.
