నర్సాపూర్ పట్టణ కేంద్రంలో ఘటన
నర్సాపూర్ (ప్రజాజ్యోతి)
-
సంక్రాంతి పండుగ వేళ గాలిపటాల సరదా.. సామాన్య ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. నిషేధిత చైనా మాంజా యమపాశంలా మారి వాహనదారుల గొంతు కోస్తోంది. నర్సాపూర్ పట్టణ కేంద్రంలో శుక్రవారం జరిగిన ఓ ఘటన చూస్తుంటే చైనా మాంజా ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది. రుస్తింపేట గ్రామం నుండి నర్సాపూర్ పట్టణానికి ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో అకస్మాత్తుగా గాలిలో తేలుతూ చైనా మాంజా ఆయన మెడకు చుట్టుకోబోయింది. ఆ వ్యక్తి వెంటనే అప్రమత్తమై దానిని చేత్తో వెనక్కి నెట్టివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం నుండి బయటపడిన సదరు వ్యక్తి, తన వెనక వస్తున్న మరో వాహనదారుడిని హెచ్చరించేలోపే ఓ ఆర్టీసీ బస్సు వేగంగా వారిని దాటుకొని వెళ్ళింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
‘పోలీసుల హెచ్చరిక.. పట్టని వైనం’
———————————
నిషేధిత చైనా మాంజాను అమ్మినా, వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా, పరిస్థితిలో మార్పు రావడం లేదు. రహస్యంగా విక్రయాలు సాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పండుగ సీజన్ ముగిసే వరకు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు జాగ్రత్త వహించక తప్పదు అని స్పష్టంగా అర్థమవుతుంది.
