ఢిల్లీ గాలిలో ప్రమాదకర ‘సూపర్‌బగ్స్’

V. Sai Krishna Reddy
2 Min Read

దేశ రాజధాని ఢిల్లీని శీతాకాలంలో కమ్మేసే విషపూరిత పొగమంచు కేవలం శ్వాసకోశ ఇబ్బందులనే కాకుండా, అంతకు మించిన ఆరోగ్య విపత్తును మోసుకొస్తోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఢిల్లీ గాలిలో యాంటీబయాటిక్స్‌ను సైతం ఎదిరించే ‘సూపర్‌బగ్స్’ (యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా) ఉన్నట్లు తేలింది. ‘నేచర్ – సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

పరిశోధకులు ఢిల్లీలోని రద్దీ మార్కెట్లు, మురికివాడలు, నివాస ప్రాంతాలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల వద్ద గాలి నమూనాలను సేకరించారు. శీతాకాలంలో కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, ఈ బ్యాక్టీరియా కౌంట్ ప్రతి క్యూబిక్ మీటరుకు 16,000 కాలనీ-ఫార్మింగ్ యూనిట్లుగా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిన సురక్షిత పరిమితి కంటే 16 రెట్లు ఎక్కువ. వర్షాకాలంలో వర్షాల వల్ల ఈ ప్రభావం కొంత తగ్గినప్పటికీ, శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత, తేమ కారణంగా ఈ సూక్ష్మజీవులు గాలిలో ఎక్కువ కాలం జీవిస్తున్నాయి.

గాలిలో గుర్తించిన బ్యాక్టీరియాలో అధిక భాగం ‘స్టెఫిలోకాకస్’ రకానికి చెందినవి. ఇవి సాధారణంగా చర్మ వ్యాధులు, న్యుమోనియా, రక్తంలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వీటిలో 73 శాతం బ్యాక్టీరియా బహుళ యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం ఆందోళనకరం. ప్రాణాధారమైన మెథిసిలిన్ వంటి మందులకు కూడా ఇవి లొంగడం లేదని ‘mecA’ అనే జన్యువు ఉనికి ద్వారా శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు.

ఇళ్ల లోపల గాలి కూడా సురక్షితం కాదు

బయటి గాలి కాలానుగుణంగా మారుతున్నప్పటికీ, ఇళ్ల లోపల గాలిలో బ్యాక్టీరియా స్థాయిలు అన్ని కాలాల్లోనూ ఎక్కువగా ఉంటున్నాయని అధ్యయనం వెల్లడించింది. గాలి సరిగ్గా ఆడని గదులు, జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ ముప్పు నిరంతరం పొంచి ఉంటోంది.

ఎవరికి ప్రమాదం?

ఆరోగ్యంగా ఉన్నవారిపై వీటి ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ.. వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ సూపర్‌బగ్స్ వల్ల చికిత్సకు లొంగని ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. పర్యావరణంలోని ఈ ప్రమాదాన్ని గుర్తించి ప్రభుత్వం తక్షణమే పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని జేఎన్‌యూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *