భారతదేశం క్రీడా రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన.. క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ భవిష్యత్తులో చేపట్టబోయే మెగా స్పోర్ట్స్ ఈవెంట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడమే లక్ష్యంగా భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ హక్కులను దక్కించుకోవడానికి ఎక్కడా రాజీపడకుండా కృషి చేస్తున్నామన్నారు. అలాగే, 2030 కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్‌లోనే జరగనున్నాయని మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో భారత్ తన సత్తాను చాటుతోందని, గత దశాబ్ద కాలంలో అండర్-17 ఫిఫా వరల్డ్ కప్, హాకీ వరల్డ్ కప్, చెస్ టోర్నమెంట్లతో సహా 20కి పైగా అంతర్జాతీయ ఈవెంట్లను మన దేశం విజయవంతంగా నిర్వహించిందని గుర్తు చేశారు.
వాలీబాల్ క్రీడ గొప్పతనాన్ని వివరిస్తూ.. ఇది కేవలం ఆట మాత్రమే కాదని, సహకారం, సమతుల్యత (బ్యాలెన్స్)తో కూడిన ప్రక్రియ అని మోదీ అభివర్ణించారు. బంతిని కింద పడకుండా గాలిలోనే ఉంచేందుకు చేసే ప్రయత్నంలో క్రీడాకారుల పట్టుదల కనిపిస్తుందన్నారు. ‘టీమ్ ఫస్ట్’ అనే నినాదంతో ప్రతి క్రీడాకారుడు జట్టు విజయం కోసమే ఆడాలని సూచించారు. వ్యక్తిగత నైపుణ్యాలు వేరైనా, సమష్టి కృషితోనే విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
జనవరి 4 నుంచి 11 వరకు జరగనున్న ఈ 72వ జాతీయ వాలీబాల్ టోర్నీలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, సంస్థల నుంచి 58 జట్లు పాల్గొంటున్నాయి. సుమారు 1,000 మందికి పైగా క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఈ టోర్నీ ద్వారా భారతీయ వాలీబాల్‌లో ఉన్న అత్యుత్తమ ప్రమాణాలు, క్రీడాస్ఫూర్తి వెలుగులోకి వస్తాయని నిర్వాహకులు ఆశిస్తున్నారు.
