వినూత్న ఆలోచనతో సర్పంచ్ అంజా గౌడ్
నర్సాపూర్/కౌడిపల్లి (ప్రజాజ్యోతి) సమస్య ఏదైనా.. పరిష్కారం ఆలోచనలో ఉంటుందని నిరూపించారు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ అంజాగౌడ్. గత కొంతకాలంగా గ్రామంలో కోతుల గుంపులు బీభత్సం సృష్టిస్తూ, గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతులు తగ్గకపోవడంతో సర్పంచ్ ఒక వినూత్న ఆలోచన చేశారు. కోతులు మనుషులకు భయపడవు కానీ, తమకంటే పెద్ద జంతువులను చూస్తే పారిపోతాయని గ్రహించిన అంజాగౌడ్.. శనివారం తన సొంత నిధులతో ప్రత్యేకంగా గొరిల్లా వేషధారణ కలిగిన దుస్తులను తెప్పించారు. ఒక వ్యక్తికి ఆ దుస్తులను ధరింపజేసి, గ్రామంలోని వీధులు, సందుల గుండా తిప్పించారు. రోడ్లపై తిరుగుతున్న ఈ ‘గొరిల్లా’ను చూసి, తమకంటే పెద్ద జంతువు ఏదో వస్తుందని భ్రమపడిన కోతుల గుంపులు గ్రామం విడిచి పరుగులు తీశాయి. పదవి చేపట్టిన వెంటనే అధికారుల నిధుల కోసం ఎదురుచూడకుండా, స్వయంగా స్పందించి ప్రజా సమస్యను తీర్చిన సర్పంచ్ అంజాగౌడ్ నిబద్ధతను గ్రామస్తులు అభినందించారు.
