అఖండ 2 ‘ మూవీ రివ్యూ

V. Sai Krishna Reddy
3 Min Read

బాలకృష్ణ నట విశ్వరూపం

మెస్మరైజ్‌ చేసే యాక్షన్‌ సన్నివేశాలు

పైసా వసూల్‌ సినిమా

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు సూపర్‌హిట్‌ జోడి అనే పేరుంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. తాజాగా ఈ సక్సెస్‌ఫుల్‌ ద్వయం మరోసారి కలిసి చేసిన సినిమా ‘అఖండ 2 తాండవం’. విజయవంతమైన ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి, ఈ చిత్రం ట్రైలర్‌ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అటు ప్రేక్షకుల్లో, ఇటు బాలకృష్ణ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ నెల 11న ప్రీమియర్స్‌తో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల జోడీ మరోసారి బ్లాక్‌బస్టర్‌ అందుకుందా? లేదా ఈ చిత్ర సమీక్షలో తెలుసుకుందాం..

కథ: శివుడిని ఆరాధిస్తూ, ఆయన నామస్మరణంతోనే ఉంటున్న అఘొరా అఖండకు (బాలకృష్ణ) గురువైన మురళీమోహన్‌ రాబోయే ఆపద నుంచి భారతదేశాన్ని, హిందు ధర్మాన్ని రక్షించాలంటే మరిన్ని శక్తులను ఆ శివుడి నుండి పొందటం కోసం అఖండను కఠోరమైన సాధన చేయమని కోరతాడు. భారతదేశాన్ని దెబ్బతీయాలంటే.. భారతీయుల సనాతన ధర్మాన్ని దెబ్బతీసి, తద్వారా ప్రజల్లో దేవుడి మీద ఉన్న నమ్మకం తీసేయాలని, అప్పుడే భారత్‌పై దాడి చేసి భారతదేశాన్ని అక్రమించాలని టిబెట్‌ దేశ జనరల్‌తో పాటు చాంగ్‌ కలిసి ప్లాన్‌ వేస్తారు. ఇందుకోసం ఠాకూర్‌ కూడా వీళ్లతో చేతులు కలుపుతాడు.

ఇందుకోసం వీళ్లు ఎంచుకున్న మార్గం ఏమిటి? సనాతన ధర్మాన్ని, ప్రజలను అఖండ ఎలా రక్షించాడు? మురళీకృష్ణ ( (రెండో బాలకృష్ణ) కూతురుగా నటించిన హర్షలి మల్హోత్రా పాత్ర ఏమిటి? సంయుక్త మీనన్‌కు కథకు సంబంధం ఏమిటి? విషాచీ (ఆది), అఖండల మధ్య జరిగిన యుద్దం ఏమిటి? చివరకు ఏం జరిగింది? అఖండ రూపంలో శివయ్య దేశాన్ని, ప్రజలను ఎలా రక్షించాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ: అఖండకు కొనసాగింపుగా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ కథను అల్లుకున్నాడు. సనాతన ధర్మం, బయోవార్‌, దైవత్వం ఇలా అన్ని కోణాల్లో ఆసక్తికరమైన సన్నివేశాలతో ఓ కమర్షియల్‌ సినిమాకు కావాల్సిన హంగులన్నీ సమకూర్చుకున్నాడు. ముఖ్యంగా ఎక్కడా కూడా సినిమాపై ఆసక్తి తగ్గకుండా ప్రేక్షకులకు, బాలకృష్ణ అభిమానులకు హై ఇచ్చే సన్నివేశాలను రాసుకున్నాడు. తొలిభాగంలో మురళీ కృష్ణ (చిన్న బాలకృష్ణ)పై యాక్షన్‌ సన్నివేశాలు, అఖండ సనాతన ధర్మం గురించి చెప్పే సీన్‌లు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు ఎంతో పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. ఇక సెకండాఫ్‌ సినిమాకు కీలకంగా ఉంటుంది.

ప్రతి సన్నివేశం ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేసేలా ఉంటుంది. యాక్షన్‌ సన్నివేశాల విషయంలో లాజిక్‌లు పట్టించుకోకపోతే అవి అతిశయంగా అనిపించినా వాటిని డిజైన్‌ చేసిన, విధానం అందర్ని అబ్బురపరుస్తుంది. సెకండాఫ్‌ కొంచెం నిడివి ఎక్కువగా అనిపించినా, ఎక్కడా కూడా ఆడియన్స్‌కు బోర్‌ కొట్టకుండా దర్శకుడు బోయపాటి శ్రీను ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా రాసుకోవడంతో పాటు ఆయన ప్రజెంట్‌ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాలో ఇంటర్వెల్‌తో పాటు పతాక సన్నివేశాలు చిత్రీకరించిన తీరు అందరిని మెస్మరైజ్‌ చేస్తుంది.

నటీనటుల పనితీరు: అఖండగా బాలకృష్ణ నటన ఎంతో ప్రశంసనీయం. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఉంటుంది. అఖండలో బాలకృష్ణను తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేం. ఆయన కనిపించిన ప్రతి సన్నివేశం థియేటర్‌లో ఆడియన్స్‌కు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. సంయుక్త మీనన్‌ ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో తన పరిధి మేరకు నటించింది. బాలకృష్ణ కూతురు పాత్రలో హర్షలి మల్హోత్రా పాత్రలో ఓ తెలుగమ్మాయిని తీసుకుంటే, ఆ పాత్ర బలంగా అనిపించేంది.

విలన్‌గా ఆది పినిశెట్టి నటన అలరిస్తుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా బోయపాటి శ్రీను తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. బాలకృష్ణను ఇలాంటి పవర్‌ఫుల్‌ పాత్రల్లో చూపించడంలో ఆయనకు మించిన వారు లేరు అనే రీతిలో బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాకు తమన్‌ నేపథ్య సంగీతం ప్రాణంగా నిలిచింది. యాక్షన్‌ సన్నివేశాల్లొ ఆయన నేపథ్య సంగీతం సన్నివేశాల స్థాయిని పెంచింది. ఫోటోగ్రఫీ సినిమాకు వన్నె తీసుకొచ్చింది. సీజీ వర్క్‌, గ్రాఫిక్స్‌ చాలా సహజంగా అనిపించాయి.

ఫైనల్‌గా: ‘అఖండ 2 తాండవం’ అన్నికమర్షియల్‌ హంగులతో రూపొందిన పైసా వసూల్‌ సినిమా. డివోషనల్‌ టచ్‌తో హై వోల్టేజ్‌ యాక్షన్‌ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో లాజిక్‌లు వదిలేసి సినిమాను సినిమాగా చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులకు ఈ సినిమా మంచి సంతృప్తినిస్తుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *