తెలంగాణలో మొట్టమొదటి ‘జెన్-జి’ థీమ్ పోస్టాఫీసు వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ప్రాంగణంలో ప్రారంభమైంది. ఎన్‌ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యధర్ సుబుద్ధి బుధవారం దీనిని లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుమితా అయోధ్య, ఎన్‌ఐటీ రిజిస్ట్రార్ సునీల్ కుమార్ మెహతా, హనుమకొండ డివిజన్ ఎస్పీ నరేంద్ర బాబు హాజరయ్యారు.
ప్రస్తుత తరం యువతను, ముఖ్యంగా విద్యార్థులను ఆకట్టుకునేలా ఈ పోస్టాఫీసును రంగురంగుల ఇంటీరియర్స్‌తో, ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. వై-ఫై సదుపాయంతో కూడిన ఈ ఇంటరాక్టివ్ కేంద్రంలో పార్శిల్ బుకింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆధార్, క్యూఆర్ ఆధారిత చెల్లింపుల వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా విద్యార్థుల కోసం స్పీడ్ పోస్ట్‌పై డిస్కౌంట్లు కూడా అందిస్తున్నారు.
