తెలంగాణ రైజింగ్: విజన్ 2047′ కోసం తెలంగాణ ప్రభుత్వం విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేసింది. నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, మాజీ ఐఏఎస్ అధికారులు అరుణా రాయ్, హర్ష్ మందార్, భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్‌లు దువ్వూరి సుబ్బారావు, రఘురామ్ రాజన్, బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తదితరులు ఈ సలహా మండలిలో సభ్యులుగా ఉంటారు.
సీఐఐ మాజీ అధ్యక్షురాలు, ప్రథమ్ సీఈవో రుక్మిణీ బెనర్జీ, ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి సలహా బోర్డు సభ్యురాలు జయతి ఘోష్, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్, ఆర్థికవేత్త మరియు పబ్లిక్ పాలసీ నిపుణుడు డాక్టర్ సంతోష్ మెహ్రోత్రా, డిజిటల్ సృజనాత్మకత, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్‌లో నిపుణులు శాంతను నారాయణ్, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ హిమాన్షు, ప్రముఖ వాతావరణ నిపుణులు అరుణాభ ఘోష్, ప్రముఖ కాలమిస్ట్ మోహన్ గురుస్వామి సలహా మండలిలో ఇతర సభ్యులుగా వ్యవహరిస్తారు.
తెలంగాణ రైజింగ్: విజన్ 2047’కు వ్యూహాత్మక దిశానిర్దేశం, సూచనలు, సమీక్ష కోసం ఈ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ప్రణాళిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్: విజన్ 2047’ పేరుతో ఒక దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది రాబోయే 25 సంవత్సరాలలో రాష్ట్రం కోసం ఒక పరివర్తనాత్మక అభివృద్ధి ప్రణాళిక ఇది. సమగ్ర ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి, పౌరులందరికీ సమాన అవకాశాలు సాధించడం దీని ప్రధాన లక్ష్యాలు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సలహా మండలి ‘తెలంగాణ రైజింగ్: విజన్ 2047’పై వ్యూహాత్మక పర్యవేక్షణ, మార్గదర్శనం చేస్తుంది.
