- కేజీబీవీ పాఠశాలలో స్ఫూర్తి.లైఫ్ స్కిల్స్ కార్యక్రమం..
- విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలి
- జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి
నల్లబెల్లి/ నవంబర్ 13( ప్రజాజ్యోతి)::
నల్లబెల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో గురువారం స్పెషల్ ఆఫీసర్ ఆవుల సునీత అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, ఎంపీడీవో శుభనివాస్ ఆధ్వర్యంలో స్ఫూర్తి లైఫ్ స్కిల్స్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో శుభనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను సమర్థంగా అధిగమిస్తూ ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాని సాధనకు కృషి చేయాలని సూచించారు. కన్తూరి బాయి, మేరికం వంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని విద్యార్థులను ప్రోత్సహించారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆటలలో పాల్గొనాలని సూచించారు.
తదనంతరం జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి విద్యార్థులతో మాట్లాడి ఎస్.ఏ I పరీక్షల మార్కులను తెలుసుకున్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి మంచి మార్కులు సాధించాలని సూచించారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలిస్తూ క్లాస్‌రూమ్‌లు, స్టోర్‌రూమ్, డైనింగ్ హాల్, వాష్‌రూమ్‌లు, మెనూ తదితర అంశాలను సమీక్షించారు.తరువాత జేసీ మేడం, ఎంపీడీవో సర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే విషయమై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జ్, జ్యోతి ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.

