దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ కారు బాంబు పేలుడులో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో డజనుకు పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికారులు వెంటనే ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, ముంబై నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
ఈ విషాద ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. “ఢిల్లీలో పేలుడు వార్త అత్యంత హృదయ విదారకంగా, ఆందోళనకరంగా ఉంది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
మమతా బెనర్జీ, ప్రియాంక గాంధీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన హృదయాన్ని కలచివేసిందని ప్రియాంక పేర్కొన్నారు. బాధిత కుటుంబాల పరిస్థితి తలచకుంటే గుండె తరుక్కుపోతోందని మమతా పేర్కొన్నా
రు.
