గత రెండేళ్లుగా అసెంబ్లీకే రాని కేసీఆర్ రాబోయే మూడేళ్ల తర్వాత అధికారంలోకి ఎలా వస్తారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ నగర అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. ఈరోజు లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారంటే అందుకు పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని ఆయన అన్నారు.
కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 7 వేల కోట్లకు అమ్మివేసిందని ఆయన ఆరోపించారు. కేటీఆర్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, స్వయంగా ఆయన సోదరి కవిత ఆరోపణలు చేస్తున్నారని, వాటికి కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చి కాళేశ్వరం పేరుతో, రెండోసారి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ధరణి పేరుతో రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉండగా దోచుకున్న సొమ్మును పంచుకునే విషయంలో విభేదాలు రావడం వల్లే ఆ కుటుంబంలో పంచాయతీ వచ్చిందని అన్నారు. వాటాల కోసం పోట్లాడుకుంటున్నారని విమర్శించారు.
కేటీఆర్ సెంటిమెంట్ మాటలను నమ్మి మోసపోతే ప్రజలు ఇబ్బందిపడతారని హెచ్చరించారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులంతా కలిసికట్టుగా ఇక్కడ అభివృద్ధి చేయాలని నిర్ణయించామని ఆయన అన్నారు.
