జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సెంటిమెంట్ రాజకీయాలు అన్ని సమయాల్లో పనిచేయవని, ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేస్తారని ఆయన స్పష్టం చేశారు. 30 నుంచి 50 వేల ఓట్ల భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. “దివంగత నేత పీజేఆర్ చనిపోయినప్పుడు, ఆయన భార్యకు అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి మూడు గంటలు పట్టింది. అప్పుడు వారి సెంటిమెంట్ ఏమైంది? నిజంగా సెంటిమెంట్ పనిచేస్తే కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనే బీఆర్ఎస్ గెలిచి ఉండేది” అని అన్నారు. ప్రజలు సెంటిమెంట్‌ను నమ్మే స్థితిలో లేరని, ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని అన్నారు.
తమ ప్రభుత్వ పాలనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కోమటిరెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌లో కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారని, కాంగ్రెస్ పార్టీకే తమ ఓటు అని స్పష్టంగా చెబుతున్నారని వివరించారు. “ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 20 వేల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశాం. ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా ఆగిన ఈ ప్రక్రియ, ఎన్నికలు ముగియగానే తిరిగి ప్రారంభిస్తాం. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తాం” అని హామీ ఇచ్చారు.
కొందరు ‘కారు కావాలా, బుల్డోజర్ కావాలా’ అని నినాదాలు చేస్తున్నారని, కానీ ఇక్కడ కారు గుర్తుకే దిక్కులేదని ఎద్దేవా చేశారు. తమ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను రౌడీ షీటర్ అంటున్నారని, దమ్ముంటే కేటీఆర్ ఒక్క ఎఫ్‌ఐఆర్ అయినా బయటపెట్టాలని సవాల్ విసిరారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించబోతోందని ఆయన పునరుద్ఘాటించారు.
