హైదరాబాద్ నగరంలోని మణికొండ పంచవటి కాలనీలో కాల్పుల కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్, పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుటుంబాల మధ్య ఈ వివాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
కేఈ ప్రభాకర్ కుమార్తెకు, నందీశ్వర్ గౌడ్ పెద్ద కుమారుడు అభిషేక్ గౌడ్‌కు వివాహం జరిగింది. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతుండటంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెకు కట్నంగా ఇచ్చిన ఫ్లాట్‌ను ఖాళీ చేయాలని అల్లుడు అభిషేక్ గౌడ్‌పై కేఈ ప్రభాకర్ ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో అభిషేక్ గౌడ్ తన వద్ద ఉన్న తుపాకీతో ప్రభాకర్‌ను బెదిరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.
గత కొంతకాలంగా వీరి మధ్య వివాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. తనను అభిషేక్ గౌడ్ బెదిరిస్తున్నాడని అక్టోబర్ 25నే రాయదుర్గం పోలీసులకు కేఈ ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. దీంతో అభిషేక్ గౌడ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం.
ఈ ఘటనపై రాయదుర్గం ఎస్‌హెచ్ఓ మాట్లాడుతూ, ఏపీకి చెందిన నాయకుడి కుమార్తె, తెలంగాణకు చెందిన నాయకుడి కుమారుడి మధ్య వివాదం తలెత్తిందని, వారికి 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, వ్యక్తిగత కారణాల వల్ల ఒక సంవత్సరం నుంచి వేర్వేరుగా జీవిస్తున్నారని తెలిపారు. గత నెల 25న పంచవటి కాలనీలోని ఆస్తి విషయంలో ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
