తాండూర్ లో 10 కోట్ల విలువైన ఎవాక్యూ ఆస్తులకు ఎసరు
-జతకట్టిన రాజకీయ నాయకులు
-మీడియాలో రాకుండా కట్టడి చేసే ఎత్తుగడలు!
-మున్సిపల్ శాఖ అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం
-నీది నాది అంటూ పంపకాలపై ఒప్పందాలు
తాండూరు అక్టోబర్ 1 ప్రజా జ్యోతి :- వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో సుమారు రూ 10 కోట్ల విలువైన ఎవాక్యూ ఆస్తులను కాజేసేందుకు కొంతమంది రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న మరి కొంతమందితో జత కట్టి
మీడియాలో ఎలాంటి కథనాలు ప్రచురితం కాకుండా అదే వ్యవస్థనుండి ఓ వ్యక్తిని పెట్టి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇంత జరిగిన కూడ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో
తాండూర్ మున్సిపల్ శాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇందులో ఆస్తులు నీవి నావి అంటూ పంపకాలపై ఒప్పందాలు కుదుర్చుకుని ఎంతో కొంత డబ్బులు ముట్ట చెప్పే పనిలో పడ్డారు. రాజకీయ ముసుగులో ఉన్న కొందరు వ్యక్తులు వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు ఏ శాఖను ఆ శాఖతోనే కట్టడి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలోని తాండూరు నడిబొడ్డులో ఉన్న ఒక పురాతన షాపింగ్ దుకాణ సముదాయాలలో వ్యాపారాలు కొనసాగిస్తున్న వారిని లోలోపల ఒబ్బందాలు కుదుర్చుకొని ఖాళీ చేయించారు. దీనికి సంబందించి తాండూరు మునిసిపల్ పరిధిలోని వార్డు నెంబర్ 27లో 5-7-75 నుంచి 5-7-79 వరకు ఇంటి నెంబర్లు కేటాయించినట్లు రికార్డుల్లో సైతం ఉన్నాయి. మొత్తం ఐదు ఆస్తులలో కొన్ని దశబ్దాల పాటు వివిధ వ్యాపారాలు కొనసాగించారు. అయితే మున్సిపల్ ఆస్తి పన్నుల రిజిస్ట్రార్ పుస్తకంలో పైన తెలిపిన ఇంటి నెంబర్లు ఉన్నాయి. అలీంఖాన్ అనే వ్యక్తి 2019లో పాకిస్తాన్ లో మృతి చెందినట్లు సమాచారం ఉంది కానీ అట్టి వ్యక్తికి సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రంను తాండూర్ మున్సిపల్ శాఖ అధికారులు జారీ చేసినట్లు ప్రచారం సాగుతుంది. అలాగే అలీంఖాన్ భార్య జైనాబీ 1994లోనే మృతి చెందారని తెలిసింది. వీరికి సంబంధం లేని వ్యక్తులు చొరబడి అట్టి ఆస్తులను కాజేసే విదంగా ఎత్తుగడలు వేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇట్టి ఆస్తులపై పలు కథనాలు వచ్చినప్పటికీ మున్సిపల్ శాఖ అధికారులు , జిల్లా యంత్రాంగం కానీ కన్నెత్తి చూసిన పాపాన పోలేదనే విమర్శలు ఉన్నాయి.
