భారత్, చైనా మధ్య విమాన ప్రయాణాలు తిరిగి పుంజుకుంటున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ ‘చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్’, షాంఘై-న్యూఢిల్లీ మధ్య నడుస్తున్న డైరెక్ట్ విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. భారత మార్కెట్ నుంచి బలమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2026 జనవరి 2 నుంచి ప్రస్తుతం వారానికి మూడుగా ఉన్న సర్వీసులను ఐదుకు పెంచనుంది.
ఈ క్యారియర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఢిల్లీ నుంచి బయలుదేరే విమానం (MU564) రాత్రి 7:55 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4:10 గంటలకు షాంఘై చేరుకుంటుంది. షాంఘై నుంచి బయలుదేరే విమానం (MU563) మధ్యాహ్నం 12:50 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5:45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) న్యూఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. సోమ, బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఈ సర్వీసుల కోసం 17 బిజినెస్-క్లాస్, 245 ఎకానమీ-క్లాస్ సీట్లు ఉన్న ఎయిర్‌బస్ A330-200 వైడ్-బాడీ విమానాలను ఉపయోగించనున్నారు. భారత్‌లో ఈ విమానయాన సంస్థకు సంబంధించిన సేల్స్, మార్కెటింగ్, టికెటింగ్ వంటి వాణిజ్య కార్యకలాపాలను ఇంటర్‌గ్లోబ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ పర్యవేక్షించనుంది. భవిష్యత్తులో కున్మింగ్-కోల్‌కతా, షాంఘై-ముంబై మార్గాల్లోనూ కొత్త సర్వీసులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ విమాన సర్వీసుల పెంపుతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ఈ ఏడాది నవంబర్ 9 నుంచి షాంఘై-ఢిల్లీ మార్గంలో విమానాలను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ట్రావెల్ డేటా ప్రొవైడర్ OAG ప్రకారం, సర్వీసులు నిలిచిపోవడానికి ముందు 2019లో ఇరు దేశాల మధ్య దాదాపు 2,588 షెడ్యూల్డ్ విమానాలు నడిచాయి.
ఇదిలా ఉంటే.. భారత విమానయాన సంస్థ ఇండిగో సైతం ఇటీవల చైనాకు సర్వీసులు ప్రారంభించింది. సోమవారం కోల్‌కతా నుంచి 180 మంది ప్రయాణికులతో గ్వాంగ్‌జౌ చేరుకున్న ఇండిగో విమానానికి చైనా ఘనస్వాగతం పలికింది. 2020 తర్వాత ఇరు దేశాల మధ్య ఇదే తొలి డైరెక్ట్ ఫ్లైట్ కావడం విశేషం. అలాగే, నవంబర్ 10 నుంచి న్యూఢిల్లీ-గ్వాంగ్‌జౌ మధ్య రోజువారీ డైరెక్ట్ విమానాలను నడపనున్నట్లు ఇండిగో ఇదివరకే ప్రకటించింది
