చిత్తూరులో పదేళ్ల క్రితం సంచలనం రేకెత్తించిన మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు సంచలన తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. పదేళ్ల క్రితం చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దారుణ హత్యకు గురయ్యారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే వారిని దారుణంగా హతమార్చారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు 23 మందిని నిందితులుగా చేర్చి చార్జిషీట్ ఫైల్ చేశారు.
విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసులు నిందితుడిగా పేర్కొన్న కాసరం రమేశ్ ను ఈ కేసులో నుంచి తప్పించింది. మరో నిందితుడు ఎస్. శ్రీనివాసాచారి మరణించాడు. ఈ హత్యలో మిగతా 21 మంది నిందితుల పాత్రపై కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇందులో ఐదుగురిని దోషులుగా నిర్ధారిస్తూ చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. తాజాగా శుక్రవారం ఈ ఐదుగురు నిందితులను ఉరి తీయాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.
ఉరిశిక్ష పడిన నిందితులు
శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ (మేయర్ భర్త మోహన్ మేనల్లుడు)
గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్
జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జయారెడ్డి
మంజునాథ్ అలియాస్ మంజు
మునిరత్నం వెంకటేష్
