మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బతికి ఉన్న మనిషిని ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది శవాల గదికి పంపించారు. రాత్రంతా ఆ శవాల మధ్య భయంతో ఏడుస్తూ గడిపిన బాధితుడిని మరుసటి రోజు ఉదయం స్వీపర్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వివరాల్లోకి వెళితే.. చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రాజు కిడ్నీకి సంబంధించిన అనారోగ్యంతో మూడు రోజుల క్రితం మహబూబాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు.
ఆసుపత్రిలో చేర్పించుకుని వైద్యం చేయాల్సిన వైద్యులు.. ఆధార్ కార్డు లేదనే కారణంతో అడ్మిట్ చేసుకోలేదు. దీంతో రాజు రెండు రోజులుగా ఆసుపత్రి ఆవరణలోనే ఉన్నాడు. ఓవైపు అనారోగ్యం, మరోవైపు తిండి లేకపోవడంతో నీరసించిపోయాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న రాజును గమనించిన ఆసుపత్రి సిబ్బంది.. రాజు మరణించాడని భావించి స్ట్రెచర్‌పై మార్చురీకి తరలించి తాళం వేశారు. రాజు ఆ రాత్రంతా మార్చురీలోని చల్లటి వాతావరణానికి వణుకుతూ చుట్టూ శవాలను చూసి భయాందోళనలకు గురయ్యాడు.
నీరసం కారణంగా ఏడిచే శక్తి లేక సన్నగా మూలుగుతున్న రాజును మరుసటి రోజు ఉదయం స్వీపర్ గమనించాడు. వెంటనే సూపర్‌వైజర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మార్చురీలో నుంచి రాజును బయటకు తీశారు. అనంతరం రాజును ఏఎంసీ వార్డులో చేర్పించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఆసుపత్రి సిబ్బందిపై స్థానికుల ఆగ్రహం
బతికున్న మనిషిని మార్చురీలో పెట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డు లేదని చికిత్స నిరాకరించడం, బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టడం సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని విమర్శిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ప్రకటించారు.
