అన్నదాతను నిండా ముంచిన మోంథా తుఫాన్
చేతికొచ్ఛే పంటలను నేల పాలు చేసిన అకాల వర్షాలు
నీట మునిగిన పంటలను చూసి కన్నీరు పెడుతున్న రైతులు
ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతులు వేడుకోలు
పాలకవీడు, అక్టోబర్ 29(ప్రజా జ్యోతి):
మొంథా తుఫాన్ పాలకీడు మండల వరి రైతులను నిండా ముంచేసింది. భారీ వర్షాలకు ఈదురుగాలు తోడవడంతో పంటనష్టం మరింత పెరిగింది.మండల పరిధిలో గత రెండు రోజులుగా కురిసిన ఆకాల వర్షాలకు వరిపైరు నేలకొరిగింది. రైతుల కష్టాన్ని మట్టిపాలు చేసింది. కోతదశలో ఉన్న పంటలను అకాల వర్షం నీటితో మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం, అధికారులు క్షేత్ర స్థాయిలో మండలంలోని అన్ని గ్రామాల్లో పంటలను పరిలించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు. గతవారం రోజులుగా పొడి వాతావరణం ఉండడంతో రైతులు కోత పనులను ప్రారంభించారు. ఆకాల నర్షాలు వరిని తడిసిముద్దచేశాయి. తేమ ఎక్కువగా ఉండటంతో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మండలంలోని పాలకీడు, అలింగాపురం,కోమటి కుంట, జానపహాడ్,గుడుగుంట్లపాలెం, తదితర గ్రామాల్లో, వరిపొలాలు నీటిలో మునిగాయి.ఒక్క నెల రోజులు ఐతే పంట చేతికొచ్చే టైం లో మూడు నెలల కష్టానికి వచ్చిన పంట ఇప్పుడు కండ్లముందే పాడవుతుందేమోనన్న భయంతో వెంటాడుతోంది. వర్షాలు ఇలాగే కురిస్తే నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో మండలంలోని వరి పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేతికి అంది వచ్చిన సమయంలో వరి పంట నేలకొరిగింది. ఆరుగాలం కష్టించి పండించిన వరి పంటలు నేలపాలు కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరానికి 30 వేల నుండి 40 వేల రూపాయల వరకు నష్టం వాటి ల్లినట్టు వాపోతున్నారు. ఎకరానికి 40 బస్తాలు వచ్చే దిగుబడి ఇప్పుడు 10 నుండి 20 బస్తాలు మాత్రమే వచ్చే పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వం తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేయించి పరిహారం అందించాలని, బాధిత రైతులను ఆదుకోవాలని రైతు సంఘ నాయకులు కోరుతున్నారు.
