రాజస్థాన్ లోని పుష్కర్ లో జరుగుతున్న పశు ప్రదర్శనకు దేశం నలుమూలల నుంచి రైతులు ఖరీదైన పశువులను తీసుకొచ్చారు. ఈ ప్రదర్శనలో ఓ గుర్రం, మరో గేదె అందరినీ ఆకర్షిస్తున్నాయి. వాటికి కళ్లు చెదిరే ధరలు పలకడమే దీనికి కారణం. చండీగఢ్ రైతు తీసుకొచ్చిన గుర్రం ‘షాబాజ్’ కు ఏకంగా రూ.15 కోట్లు.. రాజస్థాన్ కు చెందిన రైతు తీసుకువచ్చిన గేదె ‘అన్మోల్’ ధర రూ.23 కోట్లని నిర్వాహకులు చెబుతున్నారు.
షాబాజ్ గుర్రం వయసు కేవలం రెండున్నరేళ్లు మాత్రమే.. ఈ ప్రదర్శనలో షాబాజ్ పలు బహుమతులు అందుకుంది. దీనికి రైతు చెబుతున్న ధర రూ.15 కోట్లు కాగా కొనుగోలుదారులు రూ.9 కోట్ల వరకూ ఇచ్చేందుకు సిద్ధపడ్డారట. అయితే, ఆ ధరకు తాను అమ్మబోనని రైతు స్పష్టం చేశాడు. ఈ గుర్రం బ్రీడ్ కు రూ.2 లక్షల ధర పలుకుతోంది.
నలుపు రంగులో ఆకర్షణీయంగా ఉన్న అన్మోల్ గేదె ఈ ప్రదర్శనలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఈ గేదెకు రోజూ పాలు, నెయ్యిలతో పాటు డ్రైఫ్రూట్స్ పెట్టి పెంచుతున్నట్లు రైతు చెప్పారు. దీనిని రూ.23 కోట్లకు అమ్మకానికి పెట్టారు.
