దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ వసూళ్లు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. 2025 క్యాలెండర్ ఇయర్‌లో మొదటి తొమ్మిది నెలల్లో (జనవరి-సెప్టెంబర్) టోల్ ఆదాయం ఏకంగా 16 శాతం వృద్ధితో రూ.49,193 కోట్లకు చేరింది. వాహనాల రాకపోకలు గణనీయంగా పెరగడం, నిర్ణీత కాల వ్యవధిలో టోల్ రుసుములను సవరించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలని ‘ఐసీఆర్‌ఏ అనలిటిక్స్’ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో టోల్ చెల్లించే వాహనాల సంఖ్య కూడా 12 శాతం పెరిగి 26,864 లక్షలకు చేరుకుంది. గతేడాది మొత్తం మీద ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లు రూ.57,940 కోట్లుగా నమోదయ్యాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11 శాతం అధికం. వాహనాల సంఖ్య పరంగా చూస్తే, 2023లో 30,383 లక్షలుగా ఉన్న టోల్ లావాదేవీలు, 2024 నాటికి 32,515 లక్షలకు పెరిగాయి.
వాహనాల సంఖ్య కంటే టోల్ ఆదాయం వేగంగా పెరగడానికి భారీ వాహనాల వాటా ఎక్కువగా ఉండటం, టోల్ ఛార్జీల పెంపు వంటి అంశాలు దోహదపడినట్లు ఐసీఆర్‌ఏ విశ్లేషించింది.
పశ్చిమ, దక్షిణ భారతానిదే సింహభాగం
దేశ మొత్తం టోల్ ఆదాయంలో పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని కారిడార్ల వాటా సగానికి పైగా ఉండటం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ఏడాది 9 నెలల కాలంలో మొత్తం వసూళ్లలో పశ్చిమ భారతదేశం సుమారు 30 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాది 25 శాతంతో రెండో స్థానంలో, ఉత్తర భారతదేశం 23 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. తూర్పు, మధ్య భారతదేశం కలిపి నాలుగో వంతు వాటాను కలిగి ఉన్నాయి.
ప్రాంతాలను బట్టి మారుతున్న వాహనాల తీరు
పశ్చిమ, మధ్య, తూర్పు భారతదేశంలో టోల్ చెల్లించే వాహనాల్లో 50 శాతానికి పైగా వాణిజ్య వాహనాలే (సరుకు రవాణా) ఉంటున్నాయి. ముఖ్యంగా ఒడిశా, ఏపీలోని గనులు-ఓడరేవుల కారిడార్లు, ఛత్తీస్‌గఢ్‌లోని ఖనిజ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల గుండా పారిశ్రామిక, లాజిస్టిక్స్ కార్యకలాపాలు చురుగ్గా సాగడమే ఇందుకు కారణమని ఐసీఆర్‌ఏ అనలిటిక్స్ నాలెడ్జ్ సర్వీసెస్ హెడ్ మధుబని సేన్‌గుప్తా వివరించారు.
దీనికి భిన్నంగా, ఉత్తర, దక్షిణ భారతదేశంలో ప్రయాణికుల వాహనాలదే ఆధిపత్యం. ఇక్కడి టోల్ లావాదేవీలలో 65 నుంచి 70 శాతం కార్లు, జీపులే ఉంటున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాలు, శివారు ప్రాంతాలు, వ్యక్తిగత వాహనాల వినియోగం అధికంగా ఉండటం వల్ల ఈ ధోరణి కనిపిస్తోంది. మధ్య భారతదేశంలోని NH-44, NH-47, NH-52 వంటి కారిడార్లు సరుకు రవాణాతో పాటు అంతర్రాష్ట్ర ప్రయాణికుల రద్దీతో మిశ్రమ వినియోగ నెట్‌వర్క్‌గా మారుతున్నాయని నివేదిక పేర్కొంది.
