గత రెండు నెలలుగా పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న సానుకూల పరిణామాల నేపథ్యంలో ఈ విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో పసిడి, వెండి మెరుపు కోల్పోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలపడటం, అమెరికాకు చైనా, భారత్‌లతో వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతుండటం వంటి అంశాలు బంగారం, వెండిపై ఒత్తిడి పెంచాయని మెహతా ఈక్విటీస్ నిపుణుడు రాహుల్ కలాంత్రీ తెలిపారు. దీనికి తోడు గాజాలో శాంతి చర్చలు పురోగతి సాధించడంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని వివరించారు.
అయితే, అమెరికాలో ద్రవ్యోల్బణం మందగించడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు ధరల పతనాన్ని కొంతమేర అడ్డుకుంటున్నాయి. దీంతో తక్కువ ధరల వద్ద కొనుగోళ్లకు ఆసక్తి కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ వారం బులియన్ మార్కెట్‌కు అత్యంత కీలకం కానుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశమై వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. ద్రవ్యోల్బణం బలహీనంగా ఉండటంతో పావు శాతం కోత విధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫెడ్ నిర్ణయం, భవిష్యత్తుపై చేసే వ్యాఖ్యలు బంగారం గమనాన్ని నిర్దేశిస్తాయని ఆస్పెక్ట్ బులియన్ సీఈవో దర్శన్ దేశాయ్ పేర్కొన్నారు. ఈ వారం మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
