ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలంటే ఉదయాన్నే ఆధార్ కేంద్రాలకు పరుగుపెట్టి, చాంతాడంత క్యూలో నిల్చుని టోకెన్ తీసుకుని పడిగాపులు కాస్తే తప్ప సాధ్యం కాదు. చిన్న చిన్న మార్పులకూ ఓ రోజు మొత్తం ఆధార్ కేంద్రంలోనే గడిచిపోతుంది. కొన్నిసార్లు రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల మరుసటి రోజు కూడా పరుగులు పెట్టాల్సి వస్తుంది. ఇకపై ఈ ఇబ్బంది ఉండదని యూఐడీఏఐ తెలిపింది.
ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, జెండర్, చిరునామా, మొబైల్ నెంబర్ వంటి వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఆధార్ కేంద్రం దాకా వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతోంది. నవంబర్ 1 నుంచి ఈ మార్పులను ఇంట్లో కూర్చుని ఆన్ లైన్ లో మీరే మార్చేసుకోవచ్చని తెలిపింది. ఈమేరకు సరికొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.
ఆధార్ అప్డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మార్చడమే ఈ కొత్త ఆన్లైన్ విధానం లక్ష్యమని తెలిపింది. ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ అప్డేట్స్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సిందేనని తెలిపింది. అయితే, ఆధార్ అప్ డేట్ కు సంబంధించిన ఫీజులు పెరిగాయి. పేరు, అడ్రస్ మార్పులకు రూ.75, బయోమెట్రిక్ మార్పులకు రూ.125 చెల్లించాల్సిందే. 15 ఏళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్ మార్చేందుకు ఎలాంటి ఫీజు లేదని యూఐడీఏఐ పేర్కొంది
