. ఆదివాసీల అవతారం ఎత్తిన ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ దంపతులు
వినూత్న రీతిలో 32వ పెళ్లిరోజు వేడుకలు
వైరల్ గా మారిన వీడియో
మిర్యాలగూడ, అక్టోబర్ 23,( ప్రజాజ్యోతి ):
వినూత్న కార్యక్రమాలతో తరుచూ వార్తల్లో నిలిచే వ్యక్తి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి (బి ఎల్ ఆర్ ).తమ 32వ పెళ్లిరోజు వేడుకలను ఆదివాసి గూడెం లో వారి సంప్రదాయ రీతిలో జరుపుకొన్న వీడియో ఇప్పుడు మిర్యాలగూడ లో వైరల్ అయ్యింది. సామాజిక సేవతో అత్యంత ప్రజాదరణ పొంది, ఆపై ప్రజా నాయకుడిగా గెలుపొందిన ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ ప్రజా సంక్షేమం కోసం అనేక వినూత్న కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. సమాజానికి ఎంత విలువ ఇస్తారో, తన నిర్ణయాలను గౌరవించె కుటుంబానికి అంతే విలువ ఇస్తారు ఎమ్మెల్యే. కష్టసుఖాలలో తన వెన్నంటే నడిచిన జీవిత భాగస్వామి మాధవి ముచ్చట తీర్చేందుకు తమ 32 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి అడవి బాట పట్టారు.విశాఖ సమీపం లోని ప్రకృతి రమణీయత అలరారుతున్న అరకు ఏజెన్సీ ప్రాంతం లో ఆదివాసీల గూడెం లో పెళ్లిరోజు వేడుకలు వారి సాంప్రదాయ రీతిలో జరుపుకున్నారు. జనాలను పాలించే ఏలిక తమ గూడెనికి రావటంతో ముచ్చటపడ్డ గిరిజనులు భేరీలు మోగించి, సాంప్రదాయ రీతిలో నృత్యాలు చేస్తూ వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం తమ ఆచార సాంప్రదాయాల ప్రకారం ఆదివాసీలుగా ఎమ్మెల్యే దంపతులను అలంకరించి ముస్తాబు చేశారు. ఆపై వివాహ వేడుకల తంతు గిరిజన సాంప్రదాయం లో నిర్వహించారు. అనంతరం ఆదివాసిలతో కలిసి ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ మాధవి దంపతులు సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ ముచ్చటని వీడియో తీయగా దానిని ఎమ్మెల్యే అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.హంగు ఆర్భాటాలకు దూరంగా గిరి ప్రాంత ఆదివాసీలతో కలిసి పోయిన ఎమ్మెల్యే పై నేటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.