జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. బంజారాహిల్స్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిన పెద్దమ్మ గుడిని… జూబ్లీహిల్స్‌లో బీజేపీని గెలిపిస్తే పునర్నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన, ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ అంటే కేవలం అద్దాల మేడలు కాదని, ఇక్కడ ఎన్నో బస్తీలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ బస్తీల అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. “గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌పై కోపంతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌పై కోపంతో మళ్లీ బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మరోసారి మోసపోతారు. బీజేపీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం” అని బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు. ఇదే సమయంలో ఎంఐఎం పార్టీని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. “జూబ్లీహిల్స్‌లో పోటీ చేసే దమ్ము ఎంఐఎంకు లేదా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇది కీలకం కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇవాళ్టితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండగా, రేపటి నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఉంది.