ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రతిపాదనను చివరి నిమిషంలో వెనక్కి తీసుకున్నారు. విద్యుత్ యాజమాన్యం, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు ఫలప్రదమయ్యాయి. గురువారం అర్థరాత్రి వరకు సాగిన చర్చల్లో పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది.
గత మంగళవారం ప్రారంభమైన చర్చలు అసంపూర్తిగా నిలిచినా, శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సమక్షంలో మళ్లీ ప్రారంభమయ్యాయి. పలు దఫాలుగా సాగిన చర్చల అనంతరం, సీఎం పిలుపు రావడంతో విజయానంద్ వెళ్ళి యాజమాన్యం తరఫున అంగీకరించగల డిమాండ్లపై స్పష్టత నిచ్చారు. ఆ తర్వాత జెన్‌కో ఎండీ నాగలక్ష్మి, జేఎండీ ప్రవీణ్‌చంద్ నేతృత్వంలో చర్చలు కొనసాగాయి.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశంపై యాజమాన్యం అంగీకరించకపోయినా ఇతర పలు డిమాండ్లపై అంగీకారం రావడంతో సమ్మె విరమణకు ఉద్యోగ సంఘాలు ముందుకొచ్చాయి. చర్చలు అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగాయి.
యాజమాన్యం అంగీకరించిన ప్రధాన డిమాండ్లు:
* కాంట్రాక్టు ఉద్యోగులకు వైద్య సేవలు, బీమా సదుపాయాల కల్పన
* పదవీవిరమణ సమయంలో ఆర్థిక ప్రయోజనాల అందజేత
* ప్రమాదానికి గురైన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు
* 10 సంవత్సరాలు సేవలందించిన వారికి కేడర్ ఆధారంగా వెయిటేజ్ ప్రయోజనాలు
* 2022 పీఆర్సీ ప్రకారం కాంట్రాక్టు సిబ్బందికి పెరిగిన వేతనాల చెల్లింపు
* కిందిస్థాయి ఖాళీలు డిప్లమో హోల్డర్లతో భర్తీ
* గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లకు జేఎల్‌ఎం గ్రేడ్–2గా పదోన్నతి
* కారుణ్య నియామకాల వయోపరిమితిలో ఒకసారి మాత్రమే సడలింపు
కాగా, ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులో పేర్కొన్న 29 డిమాండ్లలో మెజారిటీ అంశాలకు యాజమాన్యం అంగీకారం తెలిపింది.
అంగీకరించని ప్రధాన డిమాండ్లు:
* కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా చేయడం
* కాంట్రాక్టు ఉద్యోగులకు ఏజెన్సీ ద్వారా కాకుండా నేరుగా జీతాలు చెల్లించడం
* 1999–2004 మధ్య నియమిత సిబ్బందిని జీపీఎఫ్ పరిధిలోకి తేవడం – దీనిపై కమిటీ ఏర్పాటు, తరువాత నిర్ణయం
మినిట్స్‌పై వివాదం – మార్పుల అనంతరం ఒప్పందం
చర్చల తర్వాత యాజమాన్యం తయారుచేసిన మినిట్స్ డ్రాఫ్ట్‌పై జేఏసీ నేతలు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన హామీలు రికార్డులో మరోలా పేర్కొన్నారంటూ ఆక్షేపించారు. పలు సార్లు సవరణల అనంతరం తుది ఒప్పందంపై సంతకాలు జరిగాయి.