జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. ప్రధాన పార్టీల భవితవ్యాన్ని బీసీ, ముస్లిం ఓటర్లే నిర్దేశించనుండటంతో, వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి ఆయన సతీమణి మాగంటి సునీత పోటీలో ఉండగా, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ బరిలోకి దిగారు. భారతీయ జనతా పార్టీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు రెహమత్నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ వంటి డివిజన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటి ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నారు. తాము గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982 కాగా, వీరిలో సగానికి పైగా బీసీ ఓటర్లే (దాదాపు 2 లక్షలు) ఉన్నారు. వారి తర్వాత అత్యధికంగా 96,500 మంది (24 శాతం) ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ రెండు వర్గాల ఓట్లే గెలుపోటములను శాసించనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బోరబండ, షేక్‌పేట, ఎర్రగడ్డ ప్రాంతాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంది. నియోజకవర్గంలో ఎక్కువశాతం పేద, మధ్యతరగతి ప్రజలు నివసిస్తుండటంతో, వారి ఓటు బ్యాంకుపైనే పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి.
నియోజకవర్గంలో 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారే అధికం
ఈ నియోజకవర్గంలో పురుష ఓటర్లు 2,07,367 ఉండగా, మహిళా ఓటర్లు 1,91,530 మంది ఉన్నారు. బీసీ, ముస్లింలతో పాటు వలస ఓటర్లు, ఎస్సీలు, ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా కీలకం కానున్నాయి. ముఖ్యంగా 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటంతో, వారి మద్దతు ఏ పార్టీకి లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.