భారత్‌లో తయారైన మూడు కల్తీ దగ్గు మందులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో పలువురు చిన్నారుల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ సిరప్‌తో పాటు మరో రెండు మందులు అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేసింది. ఈ ఉత్పత్తులు ఏ దేశంలోనైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రపంచ దేశాలను కోరింది.
డబ్ల్యూహెచ్ఓ గుర్తించిన కల్తీ మందుల జాబితాలో స్రెసాన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన కోల్డ్రిఫ్, రెడ్నెక్స్ ఫార్మాస్యూటికల్స్ వారి రెస్పిఫ్రెష్ టీఆర్, షేప్ ఫార్మాకు చెందిన రీలైఫ్ సిరప్లు ఉన్నాయి. ఈ మందులు ప్రాణాంతక వ్యాధులకు కారణం కావొచ్చని, వీటి వాడకం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది.
తమిళనాడులో తయారైన కోల్డ్రిఫ్ సిరప్‌లో డైథిలిన్ గ్లైకాల్ (డీఈజీ) అనే విష రసాయనం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీని పరిమాణం కేవలం 0.1 శాతం మాత్రమే ఉండాల్సి ఉండగా, ఏకంగా 48 శాతానికి పైగా ఉన్నట్లు గుర్తించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం తమిళనాడు అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. స్రెసాన్ ఫార్మాస్యూటికల్స్ తయారీ లైసెన్సును రద్దు చేయడంతో పాటు, కంపెనీ యజమాని జి. రంగనాథన్‌ను అరెస్టు చేశారు. నాణ్యతా ప్రమాణాల్లో లోపాలను గుర్తించేందుకు రాష్ట్రంలోని ఇతర ఔషధ తయారీ కంపెనీల్లోనూ విస్తృత తనిఖీలకు ఆదేశించారు.
మధ్యప్రదేశ్ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు జారీ చేసింది. రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులు సూచించవద్దని, ఐదేళ్లలోపు వారికి కూడా సాధారణంగా వీటిని సిఫార్సు చేయరాదని స్పష్టం చేసింది. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ఫార్మా రంగంలో మరింత కఠినమైన నియంత్రణ అవసరమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.