పారిస్ నగరంలోని ఓ శ్మశానంలో ఓ వింత దృశ్యం కనిపిస్తుంది. ఓ జర్నలిస్టు సమాధి వద్ద ఉన్న విగ్రహానికి మహిళలు బారులు తీరి ముద్దులు పెడుతుంటారు. ఇలా చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని వారి ప్రగాఢ విశ్వాసం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం వెనుక ఓ ఆసక్తికరమైన చరిత్ర ఉంది.
ఈ విగ్రహం విక్టర్ నొయిర్ అనే ఓ ప్రఖ్యాత ఫ్రెంచ్ జర్నలిస్టుది. 19వ శతాబ్దంలో ఫ్రాన్స్‌ను పాలిస్తున్న రాచరిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన తన కలంతో పోరాడారు. ప్రజల పక్షాన నిలబడటంతో ప్రభుత్వానికి ఆయన శత్రువయ్యారు. ఈ క్రమంలోనే 1870లో చక్రవర్తి మూడో నెపోలియన్ బంధువైన ప్రిన్స్ పియర్ బోనపార్టే, విక్టర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. విక్టర్ నొయిర్ అనేది ఆయన కలం పేరు కాగా, అసలు పేరు వైవన్ సాల్మన్.
విక్టర్ నొయిర్ హత్యతో ఫ్రాన్స్‌లో ఆగ్రహ జ్వాలలు
ప్రజా పక్షపాతి అయిన జర్నలిస్టు హత్య ఫ్రాన్స్‌లో ఆగ్రహ జ్వాలలను రగిలించింది. ఆయన అంత్యక్రియలకు లక్షలాది మంది హాజరై రాచరిక పాలనకు వ్యతిరేకంగా నినదించారు. కొన్నేళ్ల తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఒక కాంస్య విగ్రహాన్ని రూపొందించి, సమాధిపై ప్రతిష్ఠించారు. అయితే, ఈ విగ్రహం నిలబడినట్లు కాకుండా, హత్యకు గురై నేలకొరిగిన భంగిమలో సహజంగా ఉంటుంది. ఆయన టోపీ కూడా కాళ్ల వద్ద పడి ఉన్నట్లుగా చెక్కారు.
సమాధిలోని విగ్రహానికి ముద్దు.. సంతానం కలుగుతుందని నమ్మకం
తొలుత ప్రజలు ఆయనకు నివాళిగా విగ్రహాన్ని తాకి, ముద్దులు పెట్టేవారు. అయితే, అలా ముద్దు పెట్టిన కొందరు సంతానలేమితో బాధపడుతున్న మహిళలకు గర్భం దాల్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ విషయం వేగంగా వ్యాపించి, సంతానం కోరుకునే మహిళలు ఈ సమాధిని సందర్శించడం ఆచారంగా మారింది. ఈ నమ్మకాన్ని మూఢవిశ్వాసంగా పరిగణించిన అధికారులు, 2004లో సమాధి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. కానీ, మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి కంచెను తొలగించాల్సి వచ్చింది.
ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిన సమాధి
ప్రస్తుతం విక్టర్ నొయిర్ సమాధి పారిస్‌లో ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా మారింది. కేవలం విశ్వాసంతోనే కాకుండా, ఆయన చరిత్రను తెలుసుకోవడానికి కూడా చాలా మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు.