ఏడాదికి ఏకంగా 240 శాతం వరకు వడ్డీ ఇస్తానని నమ్మబలికి, అమాయక ప్రజల నుంచి రూ.50 కోట్లకు పైగా అప్పులు సేకరించి మోసగించిన రమావత్ బాలాజీ నాయక్‌ను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, పలు వ్యాపారాల్లో నష్టపోయిన నిందితుడు ఈ భారీ మోసానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఈ కేసు వివరాలు తెలిపారు. బాలాజీ నాయక్ తన మోసానికి గురైన వారిని నమ్మించడానికి వినూత్న పద్ధతులు ఎంచుకున్నాడని ఆయన వివరించారు. తన విలాసవంతమైన ఫార్చ్యూనర్, స్కార్పియో కార్లలో తిప్పుతూ, నల్గొండలోని ఐటీ టవర్‌ను చూపించి అది తన బంగ్లా అని చెప్పేవాడు. అంతేకాకుండా, ఖరీదైన విల్లాలు, వెంచర్ల వద్దకు తీసుకెళ్లి అవన్నీ తన ఆస్తులేనని నమ్మించి అప్పులు తీసుకునేవాడు.
ఈ విధంగా సేకరించిన డబ్బును మద్యం వ్యాపారం, స్టాక్ మార్కెట్‌లో ఇంట్రాడే ట్రేడింగ్, సాఫ్ట్‌వేర్ కంపెనీలలో పెట్టుబడులుగా పెట్టి భారీగా నష్టపోయాడు. కేవలం మద్యం వ్యాపారంలోనే రూ.2.30 కోట్లు, స్టాక్ మార్కెట్‌లో రూ.12.15 కోట్లు పోగొట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నష్టాలు పెరగడంతో, జల్సాలు, విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి మరిన్ని అప్పులు చేయడం మొదలుపెట్టాడు.
ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా ఉన్న సరియానాయక్ అనే వ్యక్తి తీవ్ర ఒత్తిడితో మరణించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అతడి మరణం తర్వాత ధైర్యం చేసిన కొందరు బాధితులు గుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు బాలాజీ నాయక్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.80 లక్షల విలువైన రెండు కార్లు, ఏడు మొబైల్ ఫోన్లు, పలుచోట్ల ఉన్న ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వనని బాలాజీ నాయక్ బాధితులను బెదిరించడంతో చాలామంది ముందుకు రాలేదని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా పోలీసులను ఆశ్రయించాలని, మధ్యవర్తులను నమ్మవద్దని ఆయన సూచించారు. బినామీల పేర్లపై ఉన్న ఆస్తులను కూడా గుర్తించి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.