ప్రభుత్వ పాలనలో డిజిటల్ సేవలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల్లో అత్యుత్తమ డిజిటల్ సేవలు అందిస్తున్న కార్యాలయాలకు జాతీయ స్థాయిలో అవార్డులు ప్రకటించింది. ఈ పురస్కారాల కింద గోల్డ్ అవార్డు విజేతకు రూ. 10 లక్షలు, సిల్వర్ అవార్డు విజేతకు రూ. 5 లక్షల చొప్పున భారీ నగదు బహుమతిని అందజేయనున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాతీయ స్థాయి అవార్డుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ కార్యాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న డిజిటల్ సేవల వివరాలను పొందుపరుస్తూ ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. 2023 అక్టోబర్ 1 నుంచి 2024 సెప్టెంబర్ 30 మధ్య కాలంలో అందించిన డిజిటల్ సేవలను పరిగణనలోకి తీసుకుని విజేతలను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సాంకేతికత వినియోగాన్ని పెంచి, ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.