బి ఆర్ ఎస్ బురద రాజకీయాలు మానుకోవాలి…!
రిజర్వేషన్లకు అన్ని పక్షాల మద్దతు ఉంది
– మంత్రి పొన్నం ప్రభాకర్
మిర్యాలగూడ, సెప్టెంబర్ 28,(ప్రజాజ్యోతి): బిఆర్ఎస్ బురద రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆదివారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ లతో కలిసి మాట్లాడుతూ పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఎలాంటి అవగాహన లేకుండా మూసీ గేట్లు ఎత్తామని పేర్కొనటం ఆయన విజ్ఞతకు, అవగాహన రాహిత్యానికి నిదర్శనం అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ప్రవాహం పోటెత్తిన సందర్భంలో ప్రజలను అప్రమత్తం చేసి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రజలను తరలించిన తర్వాతనే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందన్నారు. ఊహించని వరదతో ఆర్టీసీ బస్టాండ్ నీటి ప్రవాహంలో మునిగినప్పటికీ యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టామని పరిస్థితిని చక్కదిద్దామన్నారు. క్లౌడ్ బరస్టులు జరుగుతూ ఆపత్కాలంలో ప్రజలను ఆందోళనకు గురి చేయటం పద్ధతి కాదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లపై మాట్లాడుతూ ఎవరికెంతో వారికి అంత రాహుల్ గాంధీ నినాదంతో అన్ని పక్షాల ఆమోదంతో రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. 42 శాతం బీ 42 శాతంబిసి రిజర్వేషన్లకు అన్ని పక్షాల మద్దతు ఉందని స్పష్టం చేశారు. ఇందులో ఏ ఒక్కరి ప్రయోజనం లేదన్నారు. దీనిపై కొందరు కేసులు వేసినప్పటికీ కోర్టు తీర్పును స్వాగతిస్తామన్నారు.