గుంటూరు నగరంలో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగర పాలక సంస్థ యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తక్షణ చర్యగా టిఫిన్ బండ్లు, పానీపూరీ అమ్మకాలను నిషేధిస్తూ కమిషనర్ పులి శ్రీనివాసులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
నగరంలోని ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, రెడ్ల బజార్, సంగడిగుంటతో పాటు మొత్తం 9 ప్రాంతాల్లో డయేరియా వ్యాధి ప్రబలినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వ్యాధి మరింత విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు రంగంలోకి దిగారు. ఈ అంశంపై ఆయన సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయాలని, ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వ్యాధి వ్యాప్తికి కలుషిత ఆహారం, నీరు ప్రధాన కారణాలుగా భావిస్తున్నందున, ముందుజాగ్రత్త చర్యగా పానీపూరీ బండ్లు, టిఫిన్ సెంటర్ల అమ్మకాలను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిలిపివేయాలని నిర్ణయించినట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో వ్యాధిని త్వరగా నియంత్రణలోకి తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు.