వెండి కూడా బంగారం బాటలోనే పరుగులు పెడుతోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గురువారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.1,000 పెరిగి, జీవితకాల గరిష్ఠ స్థాయి అయిన రూ.1.40 లక్షలకు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో అయితే ఈ ధర ఇప్పటికే రూ.1.50 లక్షల మార్కును దాటేసింది. ఈ అనూహ్య పెరుగుదల కొనుగోలుదారులకు తీవ్ర షాక్ ఇస్తోంది.
స్పాట్ మార్కెట్లోనే కాకుండా ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లోనూ వెండి కొత్త శిఖరాలను అధిరోహించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ కాంట్రాక్టు ధర 2.63 శాతం పెరిగి రూ.1,37,530కి చేరింది. అలాగే, 2026 మార్చి కాంట్రాక్టు కూడా 2.53 శాతం లాభపడి రూ.1,38,847 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 45 డాలర్లను దాటి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేయడం ఈ పెరుగుదలకు అద్దం పడుతోంది.
ఈ ఏడాదిలో వెండి ధరల పెరుగుదల అసాధారణంగా ఉంది. గత ఏడాది చివరి నాటికి కిలో రూ. 89,700 వద్ద ఉన్న వెండి, ఇప్పటివరకూ ఏకంగా రూ.50,300 (56 శాతం) పెరిగింది. ఒకే సంవత్సరంలో వెండి ధర 50 శాతానికి పైగా పెరగడం ఇదే మొదటిసారి కాగా, గత పదేళ్లలో ఇదే అత్యధిక వార్షిక పెరుగుదల కావడం గమనార్హం.
వెండి ధరల పెరుగుదలకు పలు జాతీయ, అంతర్జాతీయ కారణాలు దోహదం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితి, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే సూచనలతో పెట్టుబడిదారులు డాలర్, బాండ్ల నుంచి బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మళ్లుతున్నారు. దీనికి తోడు ఎలక్ట్రానిక్ వస్తువులు, పారిశ్రామిక రంగాల్లో వెండి వినియోగం పెరగడం కూడా డిమాండ్‌ను పెంచుతోంది. దేశీయంగా పండగల సీజన్ కావడం, రూపాయి విలువ క్షీణించడం వంటి అంశాలు కూడా ధరల పెరుగుదలకు మరింత ఊతమిస్తున్నాయి