ఒకప్పుడు కడుపు నింపుకోవడానికి వీధుల్లో చేయి చాచి, చెత్తకుండీల్లో ఆహారం వెతుక్కున్న ఓ చిన్నారి ఇప్పుడు సమాజానికి వైద్య సేవలు అందించే డాక్టర్‌గా మారి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా మెక్‌లియోడ్‌గంజ్‌కు చెందిన పింకీ హర్యాన్, తన అకుంఠిత దీక్ష, పట్టుదలతో పేదరికాన్ని జయించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.
దుర్భర బాల్యం నుంచి మార్పు వైపు..
పింకీ హర్యాన్ అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించింది. చరణ్ ఖుద్ అనే మురికివాడలో నివసించే ఆమె కుటుంబం భిక్షాటన చేస్తూ, కొన్నిసార్లు చెత్తలో దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకుంటూ దుర్భర జీవితం గడిపింది. అయితే, అలాంటి కష్టాలు ఆమెను నిరాశలోకి నెట్టలేదు. వాటినే తన విజయానికి పునాదులుగా మార్చుకుంది.
2004లో టిబెటన్ శరణార్థి, బౌద్ధ సన్యాసి అయిన లాబ్సాంగ్ జామ్‌యాంగ్‌ను కలవడం పింకీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ధర్మశాలలో టాంగ్-లెన్ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్న ఆయన పింకీ చదువు బాధ్యతను తీసుకుంటానని ముందుకొచ్చారు. మొదట ఆమె తండ్రి కశ్మీరీ లాల్ అందుకు అంగీకరించకపోయినా జామ్‌యాంగ్ నచ్చజెప్పడంతో దయానంద్ పబ్లిక్ స్కూల్‌లో చేర్పించారు. ఆ ట్రస్ట్ హాస్టల్‌లో చేరిన మొదటి తరం పిల్లల్లో పింకీ ఒకరు.
వైద్య విద్యకు అడ్డంకులు.. అండగా నిలిచిన ట్రస్ట్
చదువులో అద్భుతంగా రాణించిన పింకీ 12వ తరగతి తర్వాత వైద్య విద్య కోసం నీట్ పరీక్ష రాసింది. అయితే, ప్రభుత్వ కళాశాలలో సీటు పొందేందుకు అవసరమైన ర్యాంకు సాధించలేకపోయింది. ప్రైవేట్ కళాశాలల్లో లక్షల ఫీజులు కట్టే స్తోమత లేకపోవడంతో ఆమె డాక్టర్ కావాలనే కల కల్లలయ్యేలా కనిపించింది.
ఆ క్లిష్ట సమయంలో టాంగ్-లెన్ ట్రస్ట్ మరోసారి ఆమెకు అండగా నిలిచింది. తమ యూకే విభాగం సహాయంతో 2018లో చైనాలోని ఓ ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలలో పింకీకి అడ్మిషన్ ఇప్పించింది. పింకీ విజయం పట్ల లాబ్సాంగ్ జామ్‌యాంగ్ గర్వంగా స్పందించారు. “చదువు అనేది కేవలం డబ్బు సంపాదించడం కోసం కాదు, మంచి మనుషులను తయారు చేయడం కోసం అని నేను నమ్ముతాను” అని ఆయన తెలిపారు.
తనను తండ్రిలా చూసుకుని, ప్రతి అడుగులోనూ మార్గనిర్దేశం చేశారని పింకీ ఆ సన్యాసి గురించి గౌరవంగా చెబుతోంది. ఆయన స్థాపించిన ఈ ట్రస్ట్ ద్వారా పింకీ లాంటి వందలాది మంది పేద పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులుగా స్థిరపడ్డారు.