నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుండపోతగా కురిసిన వర్షానికి ఓ పాత ఇంటి గోడ కూలిపోవడంతో నిద్రిస్తున్న తండ్రి, నెలన్నర వయసున్న కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
వివరాల్లోకి వెళితే… కోటగిరికి చెందిన మహేశ్ (24) తన భార్య, నెలన్నర పసికందుతో కలిసి తమ ఇంట్లో నిద్రిస్తున్నారు. సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి వారి పాత ఇంటి గోడ పూర్తిగా నానిపోయి ఒక్కసారిగా కుప్పకూలింది. గాఢ నిద్రలో ఉన్న కుటుంబంపై గోడ శిథిలాలన్నీ పడటంతో మహేశ్‌తో పాటు ఆయన చిన్నారి కుమార్తె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో మహేశ్ భార్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద శబ్దం విని చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆమెను బయటకు తీసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు