సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తోటి కార్మికుడి మృతికి నష్టపరిహారం చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీహార్‌కు చెందిన వలస కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వారు ఫ్యాక్టరీపై దాడి చేయడమే కాకుండా, శాంతిభద్రతలను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపైనా ఎదురుదాడికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే, ఇటీవల దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ఓ ప్రమాదంలో బీహార్‌కు చెందిన కార్మికుడు మరణించాడు. మృతుడి కుటుంబానికి యాజమాన్యం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని తోటి కార్మికులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే, వారి అభ్యర్థనలను యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్న కార్మికులు ఒక్కసారిగా ఆందోళన తీవ్రం చేశారు. ఫ్యాక్టరీ కార్యాలయంపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడున్న అధికారులపైనా దాడికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
అయితే, కార్మికులు పోలీసులతో వాగ్వాదానికి దిగి, వారిపైకే రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పోలీసు వాహనం పాక్షికంగా ధ్వంసమైంది. కార్మికుల ఆందోళనతో ఫ్యాక్టరీ పరిసరాల్లో భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.