ఎంగిలిపూల బతుకమ్మను నిన్న రాష్ట్రమంతటా మహిళలు సంబురంగా జరుపుకోగా మహబూబాబాద్ లో మాత్రం విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ ఆడుతూ గుండెపోటుకు గురైన ఓ మహిళ ఆసుపత్రికి తరలించేలోపే మరణించారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామానికి చెందిన శెట్టి మౌనిక (32) బతుకమ్మ పండుగ సందర్భంగా ఉదయం నుంచి ఉత్సాహంగా సిద్ధమయ్యారు.
ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి పూలను సేకరించి బతుకమ్మను పేర్చారు. సాయంత్రం గ్రామంలోని దేవాలయం వద్ద జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యంలోనే మౌనిక మరణించారని వైద్యులు తెలిపారు.
