తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
తెలంగాణ హైకోర్టు ఇటీవల సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను వేగంగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.