దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ-ఖరగ్‌పూర్‌ను విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కుదిపేస్తోంది. తాజాగా మరో పరిశోధక విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించడం క్యాంపస్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఏడాదిలో ఇది ఐదో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్‌కు చెందిన హర్ష్‌కుమార్ పాండే (27) ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం అతని తండ్రి మనోజ్ కుమార్ పాండే కుమారుడికి ఫోన్ చేయగా ఎంతసేపటికీ స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చి ఆయన వెంటనే ఐఐటీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు.
సెక్యూరిటీ సిబ్బంది బీఆర్ అంబేడ్కర్ హాల్‌లోని హర్ష్‌కుమార్ గది వద్దకు వెళ్లి చూడగా లోపలి నుంచి తాళం వేసి ఉంది. దీంతో వారు స్థానిక హిజిలీ పోలీసులకు విషయం తెలియజేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని గది తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ హర్ష్‌కుమార్ ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే అతడిని క్యాంపస్‌లోని బీసీ రాయ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఈ ఏడాది అసాధారణ మరణాల సంఖ్య ఆరుకు చేరింది. వీటిలో ఐదు ఆత్మహత్యలే కావడం గమనార్హం.
ఈ ఏడాది జూన్ 23న డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సుమన్ చక్రవర్తి.. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ‘సేతు’ యాప్, ‘మదర్ క్యాంపస్’ వంటి పలు కార్యక్రమాలను ప్రారంభించారు. సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి టార్చ్‌లైట్ ర్యాలీలో కూడా పాల్గొన్నారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది.