హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అందించిన సేవలను స్మరించుకున్నారు. నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన దారుణాలను ఆయన గుర్తుచేశారు. దశాబ్దాల పాటు గత ప్రభుత్వాలు ఈ చారిత్రక దినాన్ని విస్మరించాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ విజయాన్ని చిరస్మరణీయం చేసిందని ఆయన అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బుధవారం జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. “ఈ రోజు, సెప్టెంబర్ 17, ఒక చారిత్రకమైన రోజు. సరిగ్గా ఇదే రోజున దేశం సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పాన్ని చూసింది. భారత సైన్యం హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించి, భారతదేశ గౌరవాన్ని పునఃస్థాపించింది” అని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్ విమోచన దినం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. “భారతమాత గౌరవం, ప్రతిష్ఠల కంటే ఏదీ గొప్పది కాదు” అని మోదీ వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వాల తీరును పరోక్షంగా విమర్శిస్తూ, “దశాబ్దాలు గడిచిపోయినా ఈ చారిత్రక విజయాన్ని ఎవరూ పెద్దగా జరుపుకోలేదు. కానీ మా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయం చేసింది. మేము ఈ రోజును ‘హైదరాబాద్ విమోచన దినం’గా జరపడం ప్రారంభించాం. ఈ రోజు హైదరాబాద్‌లో ఈ వేడుకను ఎంతో గర్వంగా జరుపుకుంటున్నారు” అని తెలిపారు.
1948 సెప్టెంబర్ 17న నాటి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సెప్టెంబర్ 17న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలలో జాతీయ జెండాను ఎగురవేస్తారు