జీవితంలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థిని అంతుచిక్కని కారణాలతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన బెల్లంపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే… బెల్లంపల్లి మండలం అకెనపల్లి గ్రామానికి చెందిన ఎగ్గే రమేశ్, రాజక్క దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు కాగా, వారిలో రెండో అమ్మాయి సుప్రియ (14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంట్లోని బాత్రూమ్‌లోకి వెళ్లిన సుప్రియ, అక్కడ ఎలుకల మందు తాగేసింది. కాసేపటి తర్వాత తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారు ఆందోళనతో వెంటనే ఆమెను ఆటోలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, చికిత్స పొందుతూ సుప్రియ మృతి చెందింది. గత మూడు రోజులుగా సుప్రియ బడికి వెళ్లడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తమకు తెలియవని వారు కన్నీరుమున్నీరయ్యారు.
