ఈఎంఐ కట్టలేదా? ఇక మీ ఫోన్ లాక్.. కొత్త నిబంధనలకు ఆర్బీఐ కసరత్తు

V. Sai Krishna Reddy
2 Min Read

ఈఎంఐపై మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన వారు బకాయిలు చెల్లించడంలో విఫలమైతే, వారి ఫోన్లను దూరం నుంచే లాక్ చేసేందుకు రుణ సంస్థలకు అనుమతి ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తోంది. మొండి బకాయిలను తగ్గించే లక్ష్యంతో ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు అధికారిక‌ వర్గాలు తెలిపాయి.

దేశంలో చిన్న మొత్తాల రుణాల ఎగవేతలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఆర్బీఐ ఈ చర్యలు చేపడుతోంది. గతంలో కొన్ని ఫైనాన్స్ కంపెనీలు అనుసరించిన ఈ విధానాన్ని ఆర్బీఐ గతేడాది నిలిపివేసింది. అయితే, ఇప్పుడు రుణ సంస్థలతో సంప్రదింపులు జరిపి, పటిష్ఠ‌మైన నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను తన ‘ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్’లో చేర్చనుంది. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ కొత్త నిబంధనలు వెలువడే అవకాశం ఉంది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, రుణం ఇచ్చే సమయంలోనే ఫోన్‌ను లాక్ చేసే అవకాశంపై వినియోగదారుడి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అలాగే, ఫోన్‌ను లాక్ చేసినప్పటికీ, అందులోని వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసే అధికారం రుణ సంస్థలకు ఉండదు. “వినియోగదారుల డేటాకు రక్షణ కల్పిస్తూనే, రుణాల రికవరీకి వీలు కల్పించడమే తమ ఉద్దేశం” అని ఒక అధికారి తెలిపారు.

ఈ నిర్ణయం అమల్లోకి వస్తే బజాజ్ ఫైనాన్స్, డీఎంఐ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా రూ. లక్షలోపు రుణాల్లో ఎగవేతలు ఎక్కువగా ఉన్నాయని, ఈ విధానం ద్వారా రికవరీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 2024 నాటి ఒక అధ్యయనం ప్రకారం, దేశంలో అమ్ముడయ్యే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మూడింట ఒక వంతు చిన్న రుణాల ద్వారానే జరుగుతున్నాయి.

అయితే, ఈ విధానంపై వినియోగదారుల హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల లక్షలాది మంది వినియోగదారులను రుణ సంస్థలు ఇబ్బందులకు గురిచేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. “ఈ విధానం అత్యవసరమైన టెక్నాలజీని ఒక ఆయుధంగా మారుస్తుంది. రుణం తిరిగి చెల్లించే వరకు ప్రజల జీవనోపాధి, విద్య, ఆర్థిక సేవలకు దూరం చేస్తుంది” అని క్యాష్‌లెస్ కన్స్యూమర్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ ఎల్. ఆరోపించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *