ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌కు దూరంగా మూడు పార్టీలు

V. Sai Krishna Reddy
2 Min Read

దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. తెలంగాణకు చెందిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఒడిశాకు చెందిన బిజూ జనతా దళ్ (బీజేడీ), పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఓటింగ్‌లో పాల్గొనకూడదని ప్రకటించాయి. ఈ మూడు పార్టీలు ఏ కూటమికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా నిలవనున్నాయి.

తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సోమవారం ప్రకటించారు. పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. రైతుల సమస్యల నేపథ్యంలోనే తాము ఈ ఎన్నికలో ఎవరికీ మద్దతివ్వకుండా, తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించే తమ విధానంలో భాగంగానే ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు బీజేడీ ప్రకటించింది. ఆ పార్టీకి రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు. ఈ మేరకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సస్మిత్ పాత్ర తెలిపారు. ఇక, పంజాబ్‌లో వరదల కారణంగా తాము ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు అకాలీదళ్ వెల్లడించింది. ఆ పార్టీకి లోక్‌సభలో ఏకైక ఎంపీగా అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సతీమణి హర్సిమ్రత్ కౌర్ ఉన్నారు.

ఈ మూడు పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ, ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ సునాయాసంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాల తరఫున బి. సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 781 మంది సభ్యులు ఉండగా, గెలుపునకు 391 ఓట్లు అవసరం. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల బలంతో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉంది.

జగ్దీప్ ధన్‌ఖడ్ ఆరోగ్య కారణాలతో తన పదవికి జులై 21న రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుండగా, ఏమైనా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సాయంత్రానికి ఫలితం వెలువడనున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *