ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అప్ డేట్ విడుదల చేసింది. ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోవడం వల్ల తమ సేవల్లో జాప్యం (లేటెన్సీ) పెరిగిందని అధికారికంగా ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని తమ అజూర్ క్లౌడ్ సేవలు ఈ అంతరాయం వల్ల ప్రభావితమయ్యాయని తన స్టేటస్ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. కొన్ని గంటల తర్వాత సేవలను పునరుద్ధరించినట్లు తెలిపింది.
సౌదీ అరేబియాలోని జెడ్డా తీరానికి సమీపంలో ఎర్ర సముద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నెట్‌వర్క్ పర్యవేక్షణ సంస్థ ‘నెట్‌బ్లాక్స్’ ప్రకారం, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, పశ్చిమ ఐరోపాను కలిపే SMW4 (సౌత్ ఈస్ట్ ఆసియా-మిడిల్ ఈస్ట్-వెస్టర్న్ యూరప్ 4), IMEWE (ఇండియా-మిడిల్ ఈస్ట్-వెస్టర్న్ యూరప్) అనే రెండు కీలకమైన సబ్‌మెరైన్ కేబుల్ సిస్టమ్స్ దెబ్బతిన్నాయి. దీని ఫలితంగా భారత్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ వేగం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా క్లౌడ్ ఆధారిత సేవలు, నెట్‌వర్క్ కనెక్టివిటీపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో వినియోగదారులు ఇంటర్నెట్ వేగం మందగించడం, అడపాదడపా సేవలు నిలిచిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు.
ఎందుకింత కీలకం?
ప్రపంచ ఇంటర్నెట్ కనెక్టివిటీకి ఎర్ర సముద్రం ఒక ప్రధాన జలమార్గం. యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాల మధ్య డేటా ట్రాఫిక్‌కు ఇది కీలకమైన కారిడార్. నివేదికల ప్రకారం, ప్రపంచంలోని మొత్తం ఇంటర్నెట్ డేటాలో దాదాపు 17 శాతం ఈ మార్గంలోని కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. అందుకే ఇక్కడ చిన్న అంతరాయం ఏర్పడినా దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో హౌతీ తిరుగుబాటుదారులు నౌకలపై దాడులకు పాల్పడుతుండటంతో, దెబ్బతిన్న కేబుళ్లకు మరమ్మతులు చేయడం అత్యంత సవాలుతో కూడుకున్న పని అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హౌతీల పనేనా?
ఈ కేబుల్స్ ఎలా తెగిపోయాయన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా నౌకల లంగర్లు (యాంకర్లు) పడటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అయి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.
యెమెన్‌లోని అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం ఈ ఘటన వెనుక హౌతీ మిలిషియాల హస్తం ఉందని తీవ్రంగా ఆరోపించింది. ప్రభుత్వ సమాచార శాఖ మంత్రి మొహమ్మద్ అల్-ఎర్యానీ మాట్లాడుతూ, “ఇది హౌతీ మిలిటెంట్లు చేస్తున్న దాడుల పరంపరలో భాగమే. ప్రపంచ డిజిటల్ మౌలిక సదుపాయాలకు పెరుగుతున్న ముప్పును అంతర్జాతీయ సమాజం గుర్తించి, దానిని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి” అని పిలుపునిచ్చారు. ఈ ఘటనతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇంజనీర్లు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే పూర్తిస్థాయిలో సేవలు ఎప్పుడు పునరుద్ధరింపబడతాయో స్పష్టత లేదని నెట్‌బ్లాక్స్ తెలిపింది.