ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిణామంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఒవైసీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతుగా ముందుకు వచ్చినందుకు అసదుద్దీన్ ఒవైసీ భాయ్‌కి ధన్యవాదాలు” అని రేవంత్ రెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు.
అంతకుముందు, ముఖ్యమంత్రి తనతో ఫోన్లో మాట్లాడి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని కోరినట్లు ఒవైసీ వెల్లడించారు. హైదరాబాదీ అయిన సుదర్శన్ రెడ్డికి ఎంఐఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. తాను జస్టిస్ రెడ్డితో కూడా మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఒవైసీ పేర్కొన్నారు. వాస్తవానికి, ఎంఐఎం పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామి కానప్పటికీ ఈ మద్దతు ప్రకటించడం గమనార్హం