తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. ఆయన ఆకస్మికంగా అక్కడికి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పరిమిత సంఖ్యలో వాహనాలతో, ఎలాంటి హడావుడి లేకుండా ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా సాధారణ పౌరుడిలా నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. “భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి భక్తులకు అభివాదం చేశారు.
“గణపతి బప్పా మోరియా” అంటూ భక్తులతో కలిసి నినాదాలు చేశారు. క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనాలను పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్లను గురించి కలెక్టర్ హరిచందన ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా విధుల్లో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తితో పని చేయాలని వారికి సూచించారు.